News

విద్యుత్ షాక్ తగిలి కూలీ మృతి


భవన నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలకు విద్యుత్ షాక్ తగిలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని నీరుగట్టువారి కాలనీలో ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో కూలి పని చేస్తున్న కుల్ల శేఖర్(50) విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. అతనిని రక్షించడానికి యత్నించిన ఓబుల్‌రెడ్డి, జి.శేఖర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తుమ్మనగుట్ట పంచాయతి పరిధిలోని సెగలేటివారిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.